Saturday 27 August 2011

ఆవిష్కారం

ఉపనిషత్తుల్ని ఆవిష్కరించిన ఋషులు అసాధారణ ప్రతిభామూర్తులు. వాళ్ళ అభివ్యక్తి అపూర్వమైంది. యితరులకన్నా విభిన్నమయింది. తాము దర్శించిన సత్యాల్ని సిద్ధాంతాల స్థాయికి వాళ్ళు దిగజార్చ లేదు. అట్లాంటి ప్రయత్నాలకు పనిగట్టుకుని పూనుకోలేదు. ఉపనిషత్తులు సిద్ధాంతాలు కావు. సత్యావిష్కరాలు. అవి చిన్ని చిన్ని మెరుపులు. అంతరాంతరాళాల ప్రకంపనలు. వాటికి ఒక క్రమబద్ధత, హేతుబద్ధత వుండదు. అవి అభిప్రాయాలు కావు. ఆలోచనలు కావు. వాళ్ళ దర్శనాల్లో వాళ్ళకేం కనిపించిందో, దాన్ని యథాతథంగా వాళ్ళు వ్యక్తీకరించారు. అవి సహజంగా పూలు విచ్చుకుంటున్నట్లు వుంటాయి.
కానీ సత్యాన్ని సిద్ధాంతీకరించడానికి ప్రయత్నించిన వాళ్ళు వున్నారు. దానివల్ల సత్యం దాని జీవాన్ని కోల్పోతుంది. హెగెల్, కాంట్, ప్లేటో, అరిస్టాటిల్ మొదలయిన తాత్వికుల దగ్గర కొన్ని జ్ఞానానికి సంబంధించిన అంశాలు వున్నాయి. వాటిల్లో సత్యానికి సంబంధించిన అంశవుంది. కానీ వాటిని వాళ్ళు సర్వనాశనం చేశారు. వాటిని సిద్ధాంతాల చట్రాల్లో బంధించడానికి ప్రయత్నించారు. సత్యమెప్పుతూ సిద్ధాంతాలకు లొంగదు. లొంగదీయాలని ప్రయత్నిస్తే అది నిర్జీవంగా మారుతుంది.
కోలరిడ్జ్ గొప్ప ఇంగ్లీషు కవి. వర్డ్స్‌వర్త్‌తో కలిసి కాల్పనిక కవిత్వ ఉద్యమ నిర్మాతల్లో ఒకడు. కోలరిడ్జ్ ఎన్నో సుప్రసద్ధి కవితలు రాశాడు. కానీ ఆయన మరణించే సమయనికి ఎన్నోవేల కవితల్ని అసంపూర్తిగా వదిలేశాడు. ఆయన మరణ సమయం ఆసన్నమయింది. ఆయన సన్నిహితుల్లో ఒకరు ‘‘మీరు ఎందుకని ఎన్నో కవితల్ని అసంపూర్తిగా వదిలిపెట్టారు? నిజానికి కొన్ని కవితలయితే కొన్ని లైన్లు రాస్తే చాలు పూర్తయి పోతాయి. దాంతో వాటికి సమగ్రత, సంపూర్ణత వస్తుంది. మీరు వాటిని పూర్తి చెయ్యవచ్చు కదా! ఎందుకు అలా వదిలేశారు. ఎంతమందితో వాటి గురించి అడిగారు. మీరు కొన్ని కవితల్ని పూర్తి చేస్తే అవి ఆంగ్ల సాహిత్యంలో ఆణిముత్యాలవుతాయి. వాటివల్ల మీ పేరు మరింత చిరస్థాయిగా మిగిలిపోతుంది కదా! మీరెందుకు ఆ ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకు వాటిని అసంపూర్తిగా వదిలి పెట్టారు?’’ అన్నాడు.
దానికి కోలరిడ్జ్ ‘‘అట్లా చెయ్యడం నా చేత కాదు. పైగా వాటిని పూర్తి చెయ్యకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అప్పటిదాకా వచ్చిన ఆ కవిత్వ చరణాలు వాటంతట అవే వచ్చాయి. అవి ఎట్లా వచ్చాయో వాటిని అట్లాగే యథాతథంగా రాసిపెట్టాను. అందరూ అనుకోవచ్చు. వాటిని నేనే రాశానని. కానీ నిజానికి వాటిని నేను రాయలేదు. ఒక పరవశ క్షణంలో అవి వచ్చాయి. ఆవిష్కారమయ్యాయి. నేను నిమిత్తమాత్రుణ్ణి. అవి ఎంతవరకు ఏ మేరకు వస్తే వాటిని అంతమేరకు రాసి పెట్టాను. వాటిని పూర్తి చెయ్యగలిగే సాహసం చెయ్యను. అక్కడ నా సొంత తెలివితేటలు ప్రదర్శించే సాహసం చెయ్యను. అవి నా గుండా ప్రయాణించాయి. నేనొక మాధ్యమాన్ని మాత్రమే. వాటిలో నాకు ప్రమేయం లేదు. వాటి చివరి చరణాలు రాలేదు. వా కోసం ఎదురు చూస్తాను. వస్తే రానీ, రాకపోతే నేనేమీ చెయ్యలేను. ఆ విషయంలో నిస్సహాయుణ్ణి’’ అన్నాడు.
ఉపనిషత్ వాక్యాలు అలాంటివే. అవి ఋషుల గుండా వచ్చాయి. వాళ్ళు నిమిత్తమాత్రులు. వాటికి ఒక సిద్ధాంతాన్ని అంటగట్టడానికి వాళ్ళెప్పుడూ ప్రయత్నించలేదు. లేని సమగ్రతని తీసుకురావడానికి పూనుకోలేదు. వాటిని యథాతథంగా వ్యక్తీకరించారు. అందుకే వాటిల్లో అంత సహజత్వం, సౌందర్యం వున్నాయి. * 

తీర్పు

మనుషులు దేన్ని గురించయినా తీర్పు చేస్తూ వుంటారు. నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ఫలానా వ్యక్తి మంచివాడు. ఫలానా వ్యక్తి చెడ్డవాడు. అన్న అభిప్రాయాలకు వస్తూ ఉంటారు. ఏది మంచో? ఏది చెడ్డో నిర్ణయాలకు రావడానికి మనమెవరు?
మనిషి తన పరిస్థితుల్ని బట్టి, పరిసరాల్ని బట్టి ప్రవర్తిస్తాడు. మనం మనుషుల్ని అంచనాలతో సమీపిస్తాం. ఫలానా వ్యక్తి ఇలాంటి వాడు అని కచ్చితంగా తీర్మానిస్తాం. అతను అలాంటి వాడయితే అతనెందుకలా అయ్యాడన్నది చూడం. రేపు అతను మంచిగా ప్రవర్తించినా దాన్ని గురించి పట్టించుకోం.
ఒక సూఫీ వేదాంతి వుండేవాడు. చాలా సౌమ్యుడు. నెమ్మదస్థుడు. ఎప్పుడూ ఎవరికీ ఎట్లాంటి అపకారమూ తలపెట్టనివాడు. వీలయినంత మేర యితరులకు సాయపడేవాడు. ఫలానా వ్యక్తి మంచివాడు. ఫలానా వ్యక్తి చెడ్డవాడు అని ఎప్పుడూ ఎవరి గురించీ చెప్పని వాడు. ఎట్లాంటి నిందారోపణలు చెయ్యనివాడు.
బతుకుతెరువు కోసం చిన్నిచిన్ని వస్తువుల్ని వూళ్ళో తిరుగుతూ అమ్ముకునేవాడు. వాటిల్లో తినుబండారాలు, బొమ్మలు ఎనె్నన్నో ఉండేవి. ఒక్కోసారి రుతువుని బట్టి అతను అమ్మే వస్తువులు మారేవి. పొద్దునే్న బయల్దేరి వూరంతా తిరిగి అమ్ముకునేవాడు. సాయంత్రానికి యిల్లు చేరేవాడు. ఒకోసారి సంచిలో వస్తువులు తీసుకెళ్ళేవాడు. యింకోసారి పళ్ళు లాంటివి వున్నప్పుడు తోపుడు బండి తోసుకెళ్ళేవాడు.
ఎన్నో ఏళ్ళుగా అతని వృత్తి అదే. తను అమ్మే వస్తువులకు తగిన ధరలు పెట్టేవాడు. వాటిలో వచ్చే ఆదాయం తన తిండికి సరిపోయేంతగా మాత్రమే వుండేలా చూసుకునేవాడు. లాభాల చింత ఉండేది కాదు. దాంతో బయటకన్నా అతని దగ్గ్గర వస్తువుల ఖరీదు చాలా తక్కువ.
కానీ అతను ఎప్పుడయినా ఎవరయినా కొద్దిగా తక్కువ డబ్బులు ఇచ్చినా ఏమీ అనుకునేవాడు కాడు. కొందరు తరువాత యిస్తామని ఎగ్గొట్టేవాళ్ళు. పట్టించుకునేవాడు కాడు. అతని నెమ్మదితనం చూసి, అమాయకత్వం చూసి కొందరు సరుకులు తీసుకుని చెల్లని నాణేల్ని యిచ్చేవాళ్ళు. ఏమీ అనకుండా వాటిని తీసుకునేవాడు. అందరికీ అతని గురించి తెలిసి పోయింది. కొందరు మోసం చేసేవాళ్ళు. అతని మంచితనాన్ని చూసి కొందరు ఆదుకునేవాళ్ళు.
ఆయన చెల్లని నాణేల్ని యిచ్చినా ‘ఇవి చెల్లవు కదా!’ అనేవాడు కాడు. అరువుగా సరుకులు తీసుకుని కూడా ‘‘నీ డబ్బు యిచ్చేశాం కదా!’ అంటే ‘మీరు యివ్వ లేదు’ అనేవాడు కాడు.
ఇట్లా తిరుగుతూ వ్యాపారం చేస్తే నష్టపోతాడని కొంతమంది సాయం చేసి ఇంటి దగ్గరే ఒక అంగడి పెట్టుకోవడానికి తోడ్పడ్డాడు. అంగట్లో కూచునేవాడు. కానీ వ్యవహారంలో మార్పు లేదు. చెల్లని నాణేల్ని యిచ్చేవాళ్ళు, చేతివాటం మనుషులు ఎప్పట్లా తమ పనులు కొనసాగిస్తూనే వున్నారు.
అదనంగా పక్కవూరి జనానికి కూడా ఈ అమాయకుడి వ్యవహారం తెలిసింది. అందులో రకరకాలజనం. నిజాయితీ పరులు, మోసగాళ్ళు, అట్లా అని అతను పూర్తిగా దివాలా తియ్యలేదు. బండి నడుస్తూనే వుంది.
కాలం ఎప్పుడూ ఎక్కడా ఆగదు కదా! అతను వృద్ధుడయ్యడు. మరణ సమయం ఆసన్నమైంది. మంచంపై వున్నాడు. చివరి ఘడియలు. అప్పటిదాకా తన జీవన విధానమంతా అతని మనసులో మెదిలింది. ఆకాశంలోకి చూసి
‘‘దేవుడా! యిన్నాళ్ళూ యినే్నళ్ళూ నినే్న నమ్ముకుని జీవనం సాగించాను. చెల్లని నాణేల్ని యిచ్చినా తీసుకున్నాను. చెల్లే నాణేల్ని స్వీకరించాను. దయగావున్నవాళ్ళ ప్రేమని పొందాను. అరువు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళనీ ఏమీ అనలేదు. నాకు సాయపడిన వాళ్ళని మంచి వాళ్ళని, నన్ను మోసగించిన వాళ్ళని చెడ్డవాళ్ళని ఎప్పడూ అనలేదు. నిర్ణయాలు, తీర్పులు చెయ్యలేదు. నువ్వు సృష్టించిన మనుషుల్ని ఫలానా అని నిర్ణయించడానికి పూనుకోలేదు. నేను కూడా నీ సృష్టిలో భాగానే్న. దయచేసి నా గురించి కూడా ఎట్లాంటి నిర్ణయమూ చేయకు’’ అన్నాడు

సాక్షిగా ఉండడం

మనిషి సాక్షిగా వుండడం అభ్యసించాలి. తన విషయంలోనైనా, యితరుల విషయాల్లోనైనా అది సాధన చేసే జీవితం అపూర్వంగా వుంటుంది. ‘‘ఇది నేను చెయ్యడం లేదు. నేను సాక్షిని మాత్రమే. అక్కడ నా నిమిత్తం లేదు. ఆ చర్యతో నాకు సంబంధం లేదు. నేను దానికి బాహ్యంలో వున్నాను. కేవలం ప్రేక్షకుడిగా జరిగేది చూస్తున్నాను’’ అన్న విషయాన్ని మనిషి గుర్తు పెట్టుకోవాలి. తామరాకుపై నీటి బొట్టులా వుండడమంటే అదే.
మనిషి దాన్ని చిన్నచిన్న విషయాల నించే ప్రారంభించాలి. వుదాహరణకి మనం భోంచేస్తూ వుంటాం. భోజనం చేస్తున్నప్పుడు మననించే మనం వేరయి భోజనం చేస్తున్న వ్యక్తిని పరిశీలించాలి. అదొక అపూర్వ అనుభవం. అట్లాగే నడుస్తున్నప్పుడు నడుస్తున్న మన నుండి వేరయి మనల్ని పరిశీలించడం. ఈ క్రమంలో మెల్లమెల్లగా ఇతర విషయాల్లోనూ ప్రయోగాలు చేయవచ్చు. సాధారణంగా మనకు సంతోషం కలిగితే సంతోషంలో లీనమవుతాం. మనకు దుఃఖం కలగితే దుఃఖంలో మునిగిపోతాం. అంటే నువ్వు సంతోషమయిపోతావు. నువ్వు దుఃఖమయిపోతావు. ఇవి రెండు శాశ్వతం కావు. ప్రతి మనిషీ సంతోషం నించీ బయట పడతాడు. దుఃఖం నించీ బయట పడతాడు. అంటే అవి మనకు సంబంధించినవి కావు. ఇవి అంటని ఒక చైతన్య స్థితి ప్రతి మనిషిలో ఉంది. ఆ చైతన్య స్థితే మనమని గుర్తించినప్పుడు మనం వాటిని అంటే సంతోషాన్ని, దుఃఖాన్ని దాటి వాటిని పరిశీలిస్తాం. అప్పుడు సుఖాన్ని, దుఃఖాన్ని దాటి ఒక ఆనంద స్థితి అనుభవానికి వస్తుంది. నిజమైన మనిషితత్త్వం అదే. స్వామి రామతీర్థ పందొమ్మిదో శతాబ్దం ఆరంభంలో భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో ఒకడు. ఆయన వందేళ్ళ క్రితం అమెరికా వెళ్ళాడు. భారతీయ తత్వచింతనను పాశ్చాత్యులకు పరిచయం చేశాడు. రామతీర్థ చిత్రమయిన వ్యక్తి. మార్మికుడు. ఆయన ఎప్పుడూ ‘నేను’ అన్న మాటను వాడేవాడు కాడు. నేను వస్తున్నాను. నేను తింటున్నాను. నేను చెబుతున్నాను’’ అనేవాడు కాదు. నేను అన్న మాటలో ఎంతో అహం దాగి వుంటుంది. అధికారం వుంటుంది. ఆధిపత్యం వుంటుంది. అందుకని ఆయన ‘నేను’ అన్నమాటని పరిహరించేవాడు. కానీ ‘నేను’ స్థానంలో ఏదో వుండాలి కదా! అందుకని నేను ‘అన్న స్థానంలో’ ‘రాముడు’ అన్న మాటను వుపయోగించేవాడు. ఆ చెప్పడంలోనే రాముడు నేను కాదన్న అర్థముంది.
వుదాహరణకి ఆయనకు ఆకలి వేస్తోందనుకోండి ఆయన ‘‘నాకు ఆకలేస్తోంది అనేవాడు కాదు. రాముడికి ఆకలేస్తోంది’’ అనేవాడు. ఆయనకు తలనొప్పి వేసిందనుకోండి. రాముడికి తలనొప్పి వేస్తోంది అనేవాడు. రాముడు వేరు, తను వేరు అని ఆయన గుర్తించాడు. మనం ఇట్లాంటి సాధువుల్ని చూసే వుంటాం ఇట్లాంటి సన్యాసులు మనకు కేవలం భారతదేశంలోనే కనిపిస్తారు.
ఒకరోజు కొంతమంది ఆయన నటిస్తున్నాడని, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, జనాల్ని వంచిస్తున్నాడని ఆయన నిలదీసి అవమానించారు. దూషించారు. వాళ్ళు తిడుతున్న కొద్దీ ఆయన నవ్వుతున్నాడు. వాళ్ళందరూ ఆయన్ని అనరాని మాటలన్నా ఆయన చిరునవ్వు నవ్వుతూనే వున్నాడు. చివరికి యిక లాభం లేదనుకుని ఆ జనం వెళ్ళిపోయారు. ఆయన నవ్వడం మటకు ఆపలేదు. నవ్వుకుంటూనే తన శిష్యులున్న చోటికి వచ్చాడు. శిష్యుల్ని చూసి కూడా నవ్వాడు. గురువుగారి వింత ప్రవర్తన చూసి శిష్యులు విస్తుపోయారు. ‘‘గురువుగారూ! ఎందుకు నవ్వుతున్నారు! ఏమైంది’’ అన్నారు. రామతీర్థ శిష్యుల్ని చూసి ఈ రోజొక విషయం జరిగిందయ్యా! రాముడు దారంటే వెళుతూవుంటే ఎవరో నిలదీశారు. తిట్టారు. అవమానం పాలు చేశారు. ఆ చేసిన పనికి ఎంతో ఆనందించారు. కానీ పాపం రాముడు ఎంతో బాధ పడ్డాడు. రాముడికి ఎంతో యిబ్బంది కలిగింది. కానీ ఏం చెయ్యను. నేను రాముడికి బయట నిల్చున్నాను. అంతా చూస్తూనే వున్నాను’’ అన్నాడు.
మనిషి చైతన్యం మనిషి అహం నించీ బయటకు వచ్చి జరుగుతున్నదానికి సాక్షిగా వుండాలి. మనిషి సాధన చెయ్యాల్సింది అదే. సాధించాల్సింది అదే. సహజమైంది అదే.

ఓషో కథలు. *

మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఆ ప్రార్థన మన తీరని కోరికలతో నిండి వుంటుంది. ఎట్లాగయినా ఆ కోరికల్ని తీరుస్తాడని మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం. అంటే ప్రార్థన అన్నది బేరసారాలతో కూడి ఉంటుంది. దాన్ని మనం ప్రార్థన అంటాం.

ఒక వ్యక్తి నిరంతరం శివుణ్ణి పూజించేవాడు. ప్రార్థించేవాడు. ఉపవాసాలు చేసేవాడు. భజనలు చేసేవాడు. సంవత్సరాల తరబడి శివుణ్ణి ఆరాధిస్తూ ఎప్పటికయినా శివుడు ప్రత్యక్షమై తన కోరికలు తీరుస్తాడని తపించేవాడు. ఆ సమయం ఆసన్నమైంది.
ఒకరోజు హఠాత్తుగా శివుడు ఆ భక్తుడి ముందు ప్రత్యక్ష మయ్యాడు. కలలో కూడా ఊహించని ఆ పరిణామానికి అతను బిత్తరపోయాడు. సాక్షాత్తు శివుడే తనముందు నిల్చుంటే అతని ఆలోచనలు స్తంభించిపోయాయి. శివుడు ప్రసన్న వదనంతో భక్తుణ్ణి చూసి ‘‘నీకు మూడు వరాలు ప్రసాదిస్తున్నా. కోరుకో’’ అన్నాడు. ఒక్కసారిగా మూడు వరాలు అనే సరికి భక్తుడికి దిక్కుతోచలేదు. ‘‘స్వామీ! నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి’’ అన్నాడు. శివుడు చిరునవ్వు నవ్వి ‘‘అలాగే’’ అన్నాడు. ఆ వ్యక్తి తీవ్రంగా ఆలోచించాడు. పాతికేళ్ళ క్రితం అతనికి పెళ్ళయింది. అప్పటి నించీ అతను భార్య అజమాయిషీ కింద, అధికారం కింద నలిగిపోయాడు. ప్రతిదానికీ ఆమె అడ్డు చెప్పేది. తన మాటే నెగ్గేలా చూసుకునేది. అతని మనసులో భార్యపైన అంతులేని ఆగ్రహం వుంది. కానీ దాన్ని ఎప్పుడూ బయట పెట్టలేదు. నిగ్రహించుకున్నాడు. ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలి. ఇంతకుమించిన మంచి సమయం మళ్ళీ రాదు అనుకుని ‘‘స్వామీ! నా భార్యను చంపేయి’’ అన్నాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. దాంతో అతని భార్య చనిపోయింది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలన్నవి అనివార్యం. కానీ ఎవరిపట్లా మరొకరికి పూర్తి ద్వేషం ఉండదు. ప్రేమ, ద్వేషం విడివిడిగా ఉండవు. మనం ప్రేమించే వాళ్ళనే ద్వేషిస్తాం. ద్వేషించేవాళ్ళనే ప్రేమిస్తాం. అతను తన కళ్ళముందే భార్య చనిపోతే దానికి తనే కారణమని తెలిసి విలవిల్లాడిపోయాడు. వాళ్ళ మధ్య అనురాగ క్షణాలు, కుటుంబంపట్ల ఆమె అంకిత భావం గుర్తుకొచ్చి అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వెంటనే శివుడి పాదాలపై పడి ‘‘స్వామీ! తప్పయిపోయింది. నా భార్యను దయచేసి బతికించండి’’ అన్నాడు. శివుడు నవ్వుతూ ‘‘అలాగే’ అన్నాడు. అతని భార్య తిరిగి ప్రాణాలతో లేచింది. ఆ రకంగా రెండు వరాలు పూర్తయ్యాయి. ఇంక ఒక్క వరమే మిగిలింది. తొందరపాటువల్ల వరాలు అట్లా వ్యర్థమయ్యాయని ఆ వ్యక్తి దిగులుపడి కనీసం మూడో వరం అర్థవంతంగా ఉండాలని అనుకుంటూ శివుడితో ‘‘స్వామీ! నాకు కొద్దిగా సమయమివ్వండి’’ అన్నాడు. శివుడు ‘‘సరే! నీ యిష్టం నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తలచుకో. ప్రత్యక్షమవుతాను’’ అని అదృశ్యమైపోయాడు. రోజూ ఆ వ్యక్తి ఏం కోరుకోవాలా? అని ఆలోచించేవాడు. అతని దగ్గర ఒక వరమే వుంది. దాన్ని జాగ్రత్తగా ఆలోచించి కోరుకోవటం మంచిది. లేకుంటే ఆ కోరిక నిష్ఫలమవుతుంది. అనుకుని ఎప్పుడూ దాన్ని గురించే ఆలోచించి ఎటూ నిర్ణయించలేకపోయేవాడు. సంవత్సరం గడిచిపోయింది. భక్తుడు ఒకరోజు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్ష మయ్యాడు. భక్తుడు శివుడి పాదాలపై పడి ‘‘స్వామీ! నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏం కోరాలో నాకు అంతుబట్టడం లేదు. దయచేసి నేను ఏం కోరాలో మీరే చెప్పండి’’ అని భారాన్ని శివుడిపై వేశాడు. దానికి శివుడు ‘‘నాయనా! నువ్వు కోరుకోదగిన వరం ఒకటుంది. అది సాటి లేనిది. దానితో పోల్చదగింది మరొకటి లేదు. అది కోరుకుంటే నీకు అన్నీ నెరవేరినట్లే. అది వాంఛా రాహిత్యం. కోరికలు లేని తనం. ఆ కోరికలు లేనితనాన్ని నువ్వు కోరుకుంటే నీకు అన్నీ నెరవేరుతాయి. తక్కినవేమి కోరినా దాని ముందు అన్నీ నిష్ప్రయోజనమే’’ అన్నాడు. భక్తుడు ‘‘స్వామీ! దయతలచి నాకు వాంఛా రాహిత్యాన్ని ప్రసాదించు’’ అన్నాడు.

 * ఆంద్రభూమిలో ప్రచురించబడినవి